శ్రమైక జీవన నేపధ్యమే “మట్టిని ముద్దాడిన మనిషి ” -జాబిలి

 శ్రమైక జీవన నేపధ్యమే “మట్టిని ముద్దాడిన మనిషి ” -జాబిలి

7 ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలలో నా ప్రసంగం
ఆధునిక భారత దేశం లో దేశానికి వెన్నెముకైన రైతు,శ్రామికులు ప్రభుత్వ సహకారం లేక ప్రకృతి సహకరించక.సమాజం కంటిలో కన్నీరై జారిపోతున్నారు.ఈ శ్రామిక జీవులకు చివరకు మట్టే మిగిలింది కాని, మనుగడ మాగానీలో మట్టిలో మట్టిగా కలిసిపోతున్నాడు అందుకే ఆదరణ ఆశరా కోల్పోయి చితికి పోతున్న బతుకుల వెతలే ఈ కవితా సంపుటిలోని కవితలకు నేపథ్యాలు.
ఈ కవితా సంపుటిలో 1995 నుండి నేటిదాకా రాసిన కవితలున్నా 2010 కి ముందు వ్రాసిన కవితలు చాలా తక్కువ 2010 తరువాత వ్రాసిన కవితలు ఎక్కువ ఉన్నాయి.అంటే 21 వ శతాబ్దంలో గత పదేళ్ళలో వ్రాసిన కవితలే ఎక్కువగా ఉన్నాయి.ఈ కావ్యాన్ని గత పదేళ్ళ భారతీయ సామాజిక వాస్తవికత వస్తువు అంటే ప్రపంచీకరణ భారతీయ జీవితం మీద చేస్తున్నదాడిలోని తాజా విషయాల పై స్పందించి వ్రాసినవే.

సమాజంలో..జరుగుతున్న,అసమానతలను.అమానవీయతలను,వేదనలను.దోపిడీలను.నిరంకుశ.వాదాలను.ప్రకృతి ప్రకోపాన్ని ,కాలుష్య కోరలను ఇలా ప్రతి సందర్భాన్ని, ప్రతి సామాజిక దృశ్యాలను ప్రతీకలుగా తీసుకొని కవితలుగా మలిచాను.
ఇందులో మొత్తం 60 కవితలు ఉన్నాయి.ఈ కవితా సంపుటిని షిరిడీసాయి గ్లోబల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ శిల్పా మేడమ్ ఆర్థిక ససకారంతో ముద్రించడం జరిగింది దళారుల దోపిడీలకు గురి అవుత్తున్న రైతజలు,శ్రామికులకు ఈ కవితా సంపుటిని అంకితం చేసాను.
కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత,ప్రముఖ సాహితీ విమర్శకులు.రాచపాళెం చంద్రశేఖర రెడ్డిగారు.నవ్యాంద్ర రచయితల సంఘం అధ్యక్షులు కళారత్న బిక్కి కృష్ణ,ప్రముఖ సాహితీ విమర్శకులు శివరాం సాగర్
.ఉమ్మడిశెట్టి అవార్డు వ్యవస్థాపకులు ప్రముఖ కవి రాథేయ గారు,షిరిడీ సాయి గ్లోబల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ శిల్పా మేడమ్ గారు ముందుమాటలువ్రాయగా ప్రముఖ అష్ఠావధాని గురువులు ఆశావాది ప్రకాశ రావు గారు.ఆశీర్వచనాలు అందజేసారు.

మట్టినిముద్దాడిన మనిషి కవితా సంపుటికి ప్రముఖ చిత్రకారులు విజయభాస్కర్ గారు చక్కటి ముఖచిత్రాన్ని అందజేసారు.
“జాబిలి కవుత్వంలో మనసమాజంలోని చీకటి,వెలుగులను నిజంగా ప్రతిబింబిస్తున్నాయి.వర్తమాన వ్యవస్థలోని ఆర్తిక సాంఘీక వైరుద్యాలను,వాటి ఫలితాలను ఆవిష్కరిస్తున్నాయని” రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అంటారు

వీరు అన్నట్టు మనిషి గుండెపై మానవత్వపు జెండా నాటాలన్న సంకల్పంతో మట్టిని ముద్దాడిన మనిషి కవితాసంపుటి లోని కవితలు మానవీయతకు మద్దతు పలుకుతూ,.అస్ప్రస్యత,కులం అన్నవి శతృవులు కావడం సరికాదన్న సారాన్ని స్పష్టంగా చాటుతాయి.

ప్రముఖ సాహితీ విమర్శకులు,అను నిత్యం సాహితీ సేధ్యం చేస్తూ ఎన్నో సాహితీ వసంతాలను పూయిస్తున్న కళారత్న బిక్కికృష్ణ మట్టిని ముద్దాడినమనిషి కవితాసంపుటి ముందు మాటలో ఇలా అంటారు ఈయన
“వేకువతానై,వెన్నెల తానై,. ఒక ఉషస్సు కోసం,ఒక తేజస్సుకోసం.ఒక చైతన్య తపస్సుకోసం తానే ఒక కవిత్వమై,మనసంతా కవిత్వమై,మానవతా కేదనమైన
ఈ జాబిలి అడవి కాసిన వెన్నెలకాదు..ఎడారిలాంటి సీమపై..కురిసిన వెన్మల సోన..,నవభావాల వాన ఇతని కవిత్వం “!అంటారు

ఈ కవితా సంపుటిలోని రెండే రెండు కవితలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మట్టిని ముద్దాడిన మనిషి
**
-జాబిలి
మనుగడ మాగాణీ లో
దేహాన్ని హలంగా మలిచి
సూర్యచంద్రుల సాక్షిగా చేలు దుక్కి చేసాను

సెగనీరు చిలకరించి
ఆశల విత్తనాలు నాటి,
ఎండి పోయిన చెరువు గట్టు పై
గుండె దోసిలి పట్టి వాన కోసం వేచి చూసాను
రైతు పై జాలిలేని మేఘం
తెల్లబట్టల నాయకుడిలా
ఆశలు ఊరించి ఎగిరిపోతుంది

పంట చేతికి రాక కూలోడి చేతిలో
కరువై పోయిన సంగటి
మూలలో మూలుగుతున్న మంచం కొయ్య
ఆకలితో అరుస్తున్న బక్కపిల్లి
ఆకురాలి మోడుబోయిన వేపచెట్టులా ఇల్లు
నీళ్ళు పడని బోరుపక్క
వెక్కిరిస్తున్న అప్పుల అరుపులు
ఎండి పోతున్న చెరువులో
చేపల్లా పిల్లలు
వ్యాపారుల తులాభారాల బజారుల్లో
దగాపడ్డ తమ్ముడు
ఆకులు రాలిన చింత చెట్టుకింద
నాన్నసమాధి..
కరువుకోరలకు బలై పోయిన
అన్నదాతల ఆక్రందనలకు ఆనవాలయ్యీయి.

అనాది నుండి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టినచేతులు
దేశం నడివీధిలో దోసిలు పట్టి దేహీ అంటున్నాయి.
దేశ ఆర్థిక భారాన్ని మోసిన వెన్నెముక
కుటుంబ భారం మోయలేక కుంగి పోతోంది.
చేదు జ్ఞాపకాల చీకటిని కప్పుకున్న అతను
బ్రతుకు జీవుడా అంటూ
కష్టాలన్నీ వెన్నెలతో చెప్పుకొని కన్నీళ్ళు దిగమింగాడు
మట్టిని నమ్ముకున్న మనిషి
మట్డిలో మట్టిగా మట్టిని ముద్దాడాడు.

   పొద్దువాలిన దారెంట
       *     *     *     *     *

ఆమె ఒక సజీవ యంత్రం
దిగబడుతున్న బతుకు గుడిసె తలుపు తెరిచి.
గతం గతుకుల రోడ్డుపై నడుస్తూ…
ఒక పూట సంగటి వేటకై బయలు దేరింది
ఆమె ఒక శ్రామిక పక్షి
డొక్కలాడాలంటే..రెక్కలాడాలి
తన రెక్కల చేతులు చాచి,
అన్నంమెతుకుల ఇటుకలను
అతుకుల బతుకు బోగానీలో నింపి,
జీవ కోటి శ్రమ భారం మోసే భూమాతలా…
తలపై ఎత్తుకున్నది.
* * *
ఆమె నుదిటిపై నుండి జారుతున్న చెమట చుక్కలు
నేల రాలి గడ్డి పోచను బతికిస్తున్నా…శ్రమ విలువ కట్టలేని లోకం

ఎండుతున్న ఆమె పొట్టకేకకు డప్పవుతోంది.
శ్రమ దానం సమిట దెబ్బలకు మొద్దుబారిన దేహం
పొట్ట కూటి కోసం సరిపడని చిల్లిగవ్వలతో
పొద్దువాలిన దారెంట గూడు చేరే గువ్వై గుడిసె చేరింది.
కష్టాల కట్టె మంచంపై ఆశల నక్షత్రాల బతుకు వెలుగును తాకాలని
ఆకాశంలోకి ఆమె చూసినపుడల్లా ..
చిరిగిన జీవితం రగ్గు లో నుంచి
చేదు జ్ఞాపకాల దోమలు కాటేస్తున్నాయి.
నిదురాని ఆకలితో పోట్లాడుతున్న ఆమె
చంద్రయ్య చెలిమి తోడుగా
రాతిరిని కప్పుకుంది.
వ్యథలను వెన్నల లో ఒలకబోసి
కన్నీళ్ళను దిగమింగింది.

నమస్తే నాకు ఈ సదవకాసం కల్పించిన వంగూరిచిట్టెన్ రాజు గారుకి, తదితర పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.ఇంత విజయోత్సాహంతో సభలను జయప్రదం చేయటానికిఅహర్నిశలు కృషిచేస్తున్న సహృదయులందరికీ శిరషానవామి.తెలుగు తల్లి సేవకై నడుంబిచించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//oackoubs.com/4/2863274